అన్నీ ఇంటినుంచే...

పని ఇంటి నుంచే (ఇప్పుడు పని ఎక్కడనుంచైనా అనేసారు- ఏ ఇంటినుంచైనా అని అర్ధం- అన్ని ఇళ్లు ఉండేందుకు ఎంతమందికి రెండేసి, మూడేసి గుండెలున్నాయి కనుక) మీటింగులు ఇంటినుంచే!
సరుకులు కొనడం ఇంటినుంచే!
సినిమాలు చూడటం ఇంటినుంచే!
చదువులు చట్టబండలు ఇంటినుంచే!
అవతలవాళ్ళని చూస్తూ మాట్లాడటం ఇంటినుంచే!
మూతికి మాస్కులు, సాని టైజర్లు కొనడం ఇంటినుంచే!
మూతి నెప్పో, ఇంకో నెప్పో వచ్చినా డాక్టర్ ని చూడటం ఇంటినుంచే!

పైన కప్పేసుకుని-కింద కనపడకుండా-స్నానాలు-చట్టుబండలు లేకుండా దీక్షావస్త్రాలు కట్టుకుని,వెనకాల “బాహుబలి సెట్టింగ్”ఒకటి పెట్టుకుని కాలక్షేపం చేయడం ఇంటినుంచే!

పెళ్లి పిలుపులు ఇంటినుంచే!
పెళ్లి చూడటం ఇంటినుంచే!
దేవుడి గుడిలో అభిషేకాలు,దండాలు పెట్టుకోవడాలు ఇంటినుంచే!

బట్టల ఖర్చు లేదు!

మనసారా దగ్గడానికి వీలు లేదు!

ముక్కారా తుమ్మడానికి వీలులేదు!
ఇంట్లో వాళ్ళు వింటే “కోవిడ్ టెస్ట్”కి వెళ్ళమంటారని భయం!
అపార్ట్మెంట్ వాళ్లకి హౌస్ అరెస్ట్-తలుపు తీయాలంటే భయం!
కోవిడ్ చుట్టపు చూపుగా ఇంట్లోకి వచ్చేస్తుందని అనుమానం!

నవ్వడమైనా, ఎవరినైనా చూడటం అయినా మన బాల్కనీలోనుంచే!

ఏడాది తర్వాత ఇప్పుడు మాస్క్ లతో మొహాలు అలవాటు అయ్యాయిగానీ, “కోవిడ్ మేడం” (చాలా మర్యాద చేసాముగా మరి) వచ్చినకొత్తల్లో-పొరపాటునో, తప్పకో బయటకి వెళ్తే- మాస్క్ లో ఉన్నవాళ్ళు కళ్ళతో పలకరించినా, నవ్వినా ఎవరో తెలియని అయోమయంలో మనమూ అదే చర్య చేయడం- ఏదో వాళ్ళని

గుర్తుపట్టేసినట్టు వేషాలు!

ఇప్పుడు నిక్షేపంగా మాస్కులతో అందర్నీ గుర్తుపట్టేస్తున్నాం!
భావాల్ని వ్యక్తం చేస్తున్నాం!
కళ్ళతో నవ్వేస్తున్నాం!
మాట్లాడేస్తున్నాం!

ఇది చూసి మీ అందరికీ కూడా ఓ విషయం గుర్తుకొచ్చి ఉండాలి నాకులాగా ఆ రోజుల్లో, సినిమా పుస్తకాల్లో- హీరోల, హీరోయిన్ ల ముఖాలు ఇలాంటి మాస్కులతో కప్పేసి వాళ్ళ పేర్లు కనుక్కోమనేవాళ్ళు,దాదాపుగా నూటికి

తొంబైశాతం కరెక్ట్ గానే కనుక్కునేవాళ్ళం!

కాలక్రమేణా-మనలో ఉన్న ఆ కళ చచ్చిపోయినట్టుంది- మర్చిపోయాం కూడా, కోవిడ్ ధర్మమా అని నిద్రాణమై, అడగార ఉన్న ఆనైపుణ్యం ఏదో తన్నుకొనివచ్చింది మనందరికీ!
త్రీ బెడ్ రూమ్ హౌస్ లో మగడు- పిల్లలు ఆ మూడు రూములు కబ్జాచేసి, పొద్దున్నుంచి ఆ “పియానో లాంటి లాప్ టాప్ ముందే”, ఏదో ధ్యానమో, తపస్సో చేస్తున్నట్టు మధ్యమధ్యలో కళ్ళుమూసుకుంటూ, “వ్యాసపీఠం ముందు కూర్చున్న ఆధ్యాత్మిక వేత్తల్లాగా” పనుల్లో పడిపోతారు.
ఇంటి ఇల్లాలు ఇంతమందికి కోళ్లు కూయకముందే లేచి- పక్కింటివాళ్ల కోళ్లు, చికెన్ షాప్ లో కోళ్లు (కోవిడ్ తో కోళ్లుకూడా కూతపెట్టడం మానేశాయి) ఇంటిల్లిపాదికి కాఫీలు, టిఫినీలు, భోజనాలు, రాత్రి పొద్దుపోయేవరకూ ఇదే తంతు- “ఇంటికి దీపం ఇల్లాలు అన్నారుగా”- పొద్దున్న లేచి దీపాలు వేసి అందరూ నిద్దరోయాక దీపాలు ఆర్పి “ఆ ఇంటి దీపం” విశ్రాంతి తీసుకునేది.

ఇంటి ఇల్లాలు వంటఇంటినుంచి చప్పుళ్ళు చేయకుండా చేయాలి ఈ పనులన్నీ; కోవిడ్ తగ్గాక వంటఇళ్లు “సౌండ్ ప్రూఫ్ చేయిస్తారు” కాబోలు ముందు రోజుల్లో.అలాగే ఓ “క్వారంటైన్ రూమ్” కూడా ఏర్పాటు చేసుకుంటే సరి- ముందు చూపుతో- భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియదుగా మరి!

దీనందానికి కోవిడ్ భయానికి పని మనుషులకి సెలవులిచ్చేశారు వాళ్ళు అడగకుండానే (నిర్బంధిత సెలవలనొచ్చు)

ఆ దెబ్బతో “ప్రతి ఇంటిలోని వంటఇంటి సింకు అక్షయపాత్రగా” రూపు దాల్చింది,కడిగిన కొద్దీ వస్తూనే ఉంటాయి- అన్ని ఎక్కడనుంచి పుట్టుకొస్తాయో మరి!

ద్రౌపది “పంచపాండవులకి,అత్తగారికి,వచ్చేపోయేవాళ్లకి వండివార్చింది” అంటే ఆమె దగ్గర ఉన్న “అక్షయపాత్రతో”, ఆమె ఏమీ చేయకుండానే, చేయాల్సిన లిస్ట్ ఆపాత్రలో పడేస్తే టక్కున వాటంతట అవే అన్నీ వచ్చాయి- కాబట్టి సరిపోయిందిగానీ;లేదంటే ఓపూట మాత్రమే వండి మరోపూట ఏ పూటకూళ్ళ అమ్మ ఇంట్లోనో తినమని చెప్పి ఉండేది.

వీళ్ళు తిన్న కంచాలు, అధరువులు పెట్టడానికి గిన్నెలూ, గట్రా ఎవరు కడిగేవాళ్ళు- ఖచ్చితంగా ద్రౌపది మాత్రం చేసిఉండదు-మొగుళ్ళచేత చేయించే ఉంటుంది; అత్తగార్ని డైరెక్ట్ గా అడగకుండా- కొడుకులు చేస్తుంటే ఏ తల్లి ఊరికే కూచోగలదు, అదన్నమాట; మన అక్షయపాత్ర వేరు,ఆవిడ అక్షయపాత్ర వేరు మరి!

అదలా ఉంచితే, కోవిడ్ దెబ్బతో కొంతమంది మగవాళ్ళకి వాళ్ళ వంటఇల్లు ఎక్కడ ఉంటుందో, ఎలా ఉంటుందో తెలిసి వచ్చింది!

ఇంకొంతమంది మగాళ్లు కాస్త ఆ అక్షయపాత్ర లాంటి సింకు దగ్గర గిన్నెలు మెరుగు పెట్టడం నేర్చుకున్నారు-స్కోర్చ్ బ్రైట్ తో.అప్పుడుగానీ వీళ్ళకి తెలిసిరాలే, ఇంటి ఇల్లాలు ఇన్నేళ్లు ఎలా సతమతం అయ్యేది వీళ్ళనోళ్ళకి అందించడానికి.

కోవిడ్ ఆవిధంగా కొంత మంచే చేసిందని చెప్పాలి-జనాల్ని గృహనిర్బంధంలో ఉంచేసినా!

ఈ ఐ. టి కంపెనీల వాళ్లకు మాత్రం పిల్లల్ని,పెద్దల్ని పని చేయమంటున్నారు ఇంకా ఇంటినుంచే!

కో వి డ్ ముందు “ఐదు రోజులు” మాత్రమే పని, ఇప్పుడు ఏడు రోజులు-ఇరవై నాలుగు గంటలూ ఉద్యోగస్తులందరి చేత అడ్డంగా చాకిరి చేయుంచుకుంటున్నారు- ఆ మధ్య సర్వేలో కూడా చెప్పారు-ఈ ఇంటినుంచి పనిచేయడం అంటే విసుగుపుడుతోంది, ఎప్పుడెప్పుడు ఆఫీస్ లకి వెల్దామా అని చాలామంది ఉద్యోగస్తులు ఉబలాటపడుతున్నట్టు, పడరు మరి- వారంరోజులూ అలా తోమేస్తుంటే!

ఏది ఏమైనా కొంత మంచికూడా జరిగింది ఈ కోవిడ్ తో- ఇప్పుడు అవేమీ నేను ఏకరువు పెట్టబోవడం లేదు- అందరికి తెలిసినవేగా!

సైంటిస్టుల దయవల్ల వాక్సిన్ వచ్చేసింది, అర్హులైన వాళ్ళందరూ చేయించుకుంటే కనీసం 2022 లో అన్నా కాస్త ఈ మూతికి మాస్కులు తీసేసి, పూర్వంలాగా అందరి “పూర్తి మొహాలు” చూస్తూ ఎంచక్కా ఇంకొంత స్వేచ్ఛగా బతికేయచ్చు-రెచ్చిపోయికాదు.

పరిస్థితులన్నీ అనుకూలిస్తాయని ఆశిస్తూ ఈ ఐ. టి ఉద్యోగస్తులు- వాళ్ళ ఆఫీస్ మొహాలు, వాళ్ళ కుర్చీలు, బల్లలు ఎలా ఉన్నాయో పలకరించడానికి ఈ ఏడాది తిరిగేలోపే వెళ్లాలని కోరుతూ...

మహా ప్రభో ఇక చాలు ఇంటినుంచే

divider

Share your thoughts with Author!!

Spread the words out!!!